బీజేపీతో పొత్తు కుదరకముందు తెలుగుదేశం పార్టీ జనసేనకు 24 సీట్లు కేటాయించడం, గాయత్రీ మంత్రంలోనూ 24 అక్షరాలు ఉంటాయంటూ ఆ నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ సమర్థించడం తెలిసిందే. అయితే, బీజేపీతో పొత్తు కుదిరాక జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలే కేటాయించారు. దీనిపై ఏపీ మంత్రి రోజా సెటైర్ విసిరారు. మొదట 24 స్థానాలు ఇస్తే గాయత్రీ మంత్రం అంటూ పవన్ ఓ డైలాగ్ చెప్పారు. ఇప్పుడు 21 సీట్లు ఇచ్చారు… దీనిపై ఏం చెప్పాలో త్రివిక్రమ్ డైలాగు రాసివ్వలేదేమో!” అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అయినా, జనసేనకు ఇచ్చిన ఆ 21 సీట్లలోనూ 10 మంది వరకు టీడీపీ నేతలే ఉంటారని రోజా ఎద్దేవా చేశారు. ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన జాబితాలు చూసి మా వాళ్లు (వైసీపీ) సంబరాలు చేసుకున్నారు అని వెల్లడించారు. ఏపీలో ప్రధాని మోదీ సభ తర్వాత కూటమి ఓటమి ఖరారైందని అన్నారు. గతంలో తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రోజా ప్రశ్నించారు. ఇవాళ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.