అహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
• అన్న క్యాంటీన్లను కమిషనర్ పి.విశ్వనాథ్ అకస్మిక తనిఖీ
• మరింత స్వచ్ఛత, సౌకర్యాలు మెరుగుపరచాలి
నగరంలోని అన్న క్యాంటీన్లలో అహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ నిర్వాహకులకు ఆదేశించారు. శనివారం ఆయన కొండారెడ్డి బురుజు, కలెక్టరేట్ అన్న క్యాంటీన్లను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, నీటి వసతి, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, వినియోగించే పదార్థాల నిల్వ విధానాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం రిజిస్టర్‌లో సంతకం చేసి రిమార్క్స్ నమోదు చేశారు. ఆహార నాణ్యతను ప్రతిరోజు పరిశీలించి తన దృష్టికి తీసుకోరావాలని నోడల్ అధికారులను ఆదేశించారు. సంబంధిత పారిశుద్ధ్య తనిఖీదారుడు ప్రతి రోజూ విధిగా స్వచ్ఛత పనులు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్లలోఎఫ్‌యస్‌యస్ఏఐ నియమాలు తప్పనిసరిగా అమలు చేయాలని కమిషనర్ సూచించారు. రోజువారీ వంట ప్రక్రియలో ఉపయోగించే ముడి పదార్థాలు తాజాగా ఉండాలని, పాతవి వెంటనే తొలగించాలని తెలిపారు. వంటశాలలో పాత్రలు, వంటసామగ్రి, ప్లేట్లు, గ్లాసులు ప్రతి వాడుకకు ముందు మరియు తరువాత సమగ్రంగా శుభ్రం చేయడం అనివార్యమని పేర్కొన్నారు. శుద్ధి చేసిన నీటినే వంటకు, తాగడానికి ఉపయోగించాలని, నీటి నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని చెప్పారు.
సిబ్బంది చేతి పరిశుభ్రత, గ్లౌవ్స్, క్యాప్, హెయిర్‌నెట్ వంటి భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కూర్చునే సౌకర్యాలు, నీటి సదుపాయాలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మెనూలో పోషకాహార ప్రాధాన్యత ఉన్న పదార్థాలను మాత్రమే అందించడంపై క్యాంటీన్ నిర్వాహకులు దృష్టి పెట్టాలని కమిషనర్ సూచించారు.