పులపర్తిని పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్

 


భీమవరం మాజీ శాసనసభ్యుడు పులపర్తి ఆంజనేయులు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తనకు యుద్ధం చేయడమే తెలుసని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో తాను ప్రచారం చేస్తుంటే కొందరు నేతలు వచ్చి.. వారిని తిట్టొద్దు, వీరిని తిట్టొద్దు, వాళ్లు నా బంధువులు అని అడ్డుకున్నారని వెల్లడించారు. రాజకీయాలు అన్న తర్వాత బంధుత్వాలేవీ ఉండవని... నా వర్గమా, ప్రత్యర్థి వర్గమా అని మాత్రమే చూడాల్సి ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే, తనను అడ్డుకున్న నేతలు ఇప్పుడు పార్టీలో లేరని అన్నారు. 


పొత్తులో భాగంగా తాము కొన్ని సీట్లలోనే పోటీ చేస్తున్నామని, దాంతో చాలామంది ఇంత తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నారా అంటున్నారని పవన్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో కనీసం తన ఒక్కడ్ని గెలిపించినా, మరిన్ని సీట్లు  డిమాండ్ చేయగల స్థితిలో ఉండేవాళ్లమని, ఇప్పుడిలా తక్కువ సీట్లలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదని వివరించారు. గతంలో చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయని, దానికి పరిహారం ఇది అని తెలిపారు. 

అయితే, 2019లో ఓడిన వ్యక్తి ఇవాళ అసాధ్యమనుకున్న పొత్తును సాధ్యం చేయడంలో కీలకపాత్ర పోషించాడని తన గురించి చెప్పుకున్నారు. ప్రజలు తనకు ఇచ్చిన ప్రేమ, బలం వల్లనే ఇది సాధ్యమైందని వినమ్రంగా తెలిపారు. 

జగన్ ను రాష్ట్రం నుంచి, గ్రంథి శ్రీనివాస్ ను భీమవరం నుంచి తరిమేయాలి

భీమవరం కుబేరులు నివసించే నగరం. కానీ ఇప్పుడా నగరం ఒక వీధి రౌడీ కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఆ వ్యక్తి చాలామంది నేతలకు బంధువు. ఎవరైనా సరే, తప్పు చేస్తున్నప్పుడు అడ్డుకోవాలి కదా! ఎందుకు అతడ్ని అడ్డుకోవడంలేదు. జగన్ ను రాష్ట్రం నుంచి, గ్రంథి శ్రీనివాస్ ను భీమవరం నుంచి తరిమేయాలి. ఒక వీధి రౌడీని గెలిపిస్తే... రోడ్డు పక్కన సోడా బండ్లు పెట్టుకునే వారిని కూడా బెదిరించే స్థాయికి వచ్చాడు. భీమవరం ప్రజలు చాలా ఇబ్బందులు  పడుతున్నారు. అతడు కాపు వర్గానికి చెందినవాడైతే అయ్యుండొచ్చు... సరైన వ్యక్తి కాకపోతే అతడిని ఓడించాల్సిందే.

సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇస్తాం

జగన్ సిద్ధం సిద్ధం అంటున్నాడు. ఆయనకు యుద్ధం ఇస్తాం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వ మార్పు. వచ్చే ఎన్నికల్లో భీమవరం జలగతో సహా జగన్ తాలూకు జలగలను తీసిపారేస్తాం. ఈసారి ఎన్నికల్లో కూటమి గెలవాలి. నేను తక్కువ సీట్లు తీసుకున్నాను అనుకోవద్దు. 175 స్థానాల్లో పోటీ చేస్తున్నవారందరూ మనవాళ్లే అనుకోండి... జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయండి. 

నేను భీమవరంలో స్థలం కొనుక్కుంటాను

భీమవరంలో ఎంతో మంది సంపన్నులు  ఉన్నారు. కానీ ఒక వీధి రౌడీకి భయపడుతున్నారు. భీమవరంలో నాకు స్థలం అమ్మడానికి వచ్చిన వ్యక్తిని బెదిరించారు. నాకే స్థలం ఇవ్వడానికి భయపడుతున్నారంటే, అక్కడ రౌడీయిజం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

భీమవరంలో జనసేన పార్టీకి స్థలం చూడమని పులపర్తి ఆంజనేయులు గారిని కోరుతున్నాను. నేను స్థలం కొనుక్కుని పార్టీ ఆఫీసు ఏర్పాటు చేస్తాను. నివాసం కూడా ఉంటాను. ఈసారి భీమవరం సీట్ ను జనసేన పార్టీ కొట్టి  తీరాల్సిందే. అవతలి వాళ్లు ఎన్ని కోట్లయినా కుమ్మరించనీ... భీమవరంలో జనసేన జెండా ఎగరాలి.

2019లో పులపర్తి ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు. ఆయన వేరే పార్టీలో ఉన్నప్పటికీ భీమవరంలో నేను ఓడిపోగానే నాకంటే ఆయనే ఎక్కువగా బాధపడ్డారు. మీరు పోటీ చేస్తారని ముందే తెలిసి ఉంటే నేను బరిలోకే దిగేవాడ్ని కాదని ఆయన చెప్పారు.

నా వ్యూహం నాకుంది!

ఎన్నికల వ్యూహం నాకు వదిలేయండి... నేను చూసుకుంటాను. వాళ్లు వ్యూహం సినిమా మాత్రమే తీస్తారు... నేను వ్యూహం రూపొందించగలను. నా వ్యూహం రాష్ట్రంపై, దేశంపై ఉంటుంది.