కాంగ్రెస్ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌

 


లోక్‌సభ ఎన్నికలు-2024లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఖరారైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా బోల్డ్‌గా ఉన్న ఫొటోని షేర్ చేసి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత సుప్రియా ఈ పోస్టును తొలగించి తన ఇన్‌స్టా అకౌంట్‌ను ఎవరో యాక్సెస్ చేసుకుని ఈ పోస్ట్ పెట్టారని ప్రకటించారు. తన ఖాతాను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారి అన్నారు. అయినప్పటికీ సుప్రియా పోస్టు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య సోషల్ మీడియా యుద్ధానికి దారి తీసింది.

ఈ అభ్యంతరకర పోస్టుపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా ‘‘ సుప్రియా గారూ.. నటిగా గత 20 ఏళ్ల కెరియర్‌లో నేను అన్ని రకాల మహిళల పాత్రల్లో నటించాను. క్వీన్‌ సినిమాలో అమాయక అమ్మాయి నుంచి ధాకడ్‌ మూవీలో గూఢచారి వరకు.. మణికర్ణికలో దేవత నుంచి చంద్రముఖిలో రాక్షసురాలిగా నటించాను. ఇక రజ్జో సినిమాలో వేశ్య నుంచి తలైవిలో విప్లవ నాయకురాలి వరకు విభిన్న పాత్రలు పోషించాను. మన ఆడబిడ్డలను పక్షపాత సంకెళ్ల నుంచి విముక్తి కల్పించాలి. మహిళల శరీర భాగాలపై ప్రదర్శించే ఉత్సుకతను మించి మనం ఎదగాలి. అన్నింటికి మించి కడుపు నింపుకోవడం సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్న వారి జీవితాలను లేదా పరిస్థితులతో ముడిపెడుతూ దూషణలకు దిగడం మానుకోవాలి. ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలే’’ అని కంగనా రనౌత్ రాసుకొచ్చారు. 

కాగా ఆదివారం రాత్రి బీజేపీ విడుదల చేసిన జాబితాలో కంగనా రనౌత్ పేరుని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో మండి లోక్‌సభ స్థానం నుంచి ఆమె పేరుని కాషాయ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.