ఐపీఎస్‌ పోస్టుకు సిద్ధార్థ్‌ కౌశల్‌ గుడ్‌బై..!*

*ఐపీఎస్‌ పోస్టుకు సిద్ధార్థ్‌ కౌశల్‌ గుడ్‌బై..!*

*ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు...*

చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ వేధింపులు ఐపీఎస్‌ అధికారులనూ హడలెత్తిస్తున్నాయి.

ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో విసిగివేసారిపోయిన ఐపీఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ కౌశల్‌ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్‌)గా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌) కోసం దరఖాస్తు చేశారని పోలీసువర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ కౌశల్‌ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఐపీఎస్‌ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 24 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించింది. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టంది. డీజీ స్థాయి అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, పీవీ సునీల్‌ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ టి.కాంతి రాణా, డీఐజీ విశాల్‌ గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్‌ చేసింది.

వెయిటింగ్‌లో ఉంచిన 24 మంది ఐపీఎస్‌ అధికారుల్లో కొందరికి చాలా నెలల తరువాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవి శంకర్‌ రెడ్డి, రిషాంత్‌ రెడ్డి, జాషువాలకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వనే లేదు. ఇక రెడ్‌ బుక్‌ కుట్రలకు వత్తాసు పలకలేక ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్‌ కౌశల్‌ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం గమనార్హం. పోలీసు శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించినా ఆ సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఢిల్లీలో కార్పొరేట్‌ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం.