మట్టి వినాయకుని పూజిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం


*మట్టి వినాయకుని పూజిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం*

*డీజేలకు అనుమతి లేదు*

*జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్*

పార్వతీపురం, ఆగస్టు 25 : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని పూజిద్దామని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ మట్టి గణపతినే పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన రంగు రంగుల గణపతి ప్రతిమలు, రసాయన రంగులతో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని గుర్తుచేశారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలు ప్రకృతికి అనుకూలమైనందున సులభంగా భూమిలో కలిసిపోతాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక, జిల్లా పశు సంవర్ధక అధికారి ఎస్.మన్మధరావు, డిఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావులకు వినాయక మట్టి విగ్రహాలను, వ్రతకల్ప పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేశారు. 

*డీజేలకు అనుమతి లేదు*

గణపతి నవరాత్రుల నేపథ్యంలో ఎక్కడా డీజేలకు అనుమతి లేదని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. శబ్ద కాలుష్యం లేకుండా మైక్ సెట్లు ఏర్పాటుచేసుకోవచ్చని అన్నారు. అలాగే పోలీసుల అనుమతితో నిర్ణీత కాలంలో మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, నిమజ్జనం సమయంలో ప్రశాంతంగా ఉత్సవాలు జరుపు కోవచ్చని తెలిపారు. వర్షాలు దృష్ట్యా నదులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున నిమజ్జనం సమయంలో గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 


ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డిఆర్ఓ కె.హేమలత, ఎస్డిసీ పి.ధర్మచంద్రారెడ్ది, డిఆర్డిఏ, పీడీ ఎం.సుధారాణి, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన,పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖాధికారులు కె.రాబర్ట్ పాల్,వై.క్రాంతి కుమార్, టి.కొండలరావు, ఎస్.భాస్కర రావు, ఐసీడిఎస్, డ్వామా పీడీలు టి.కనకదుర్గ, కె.రామచంద్రరావు,  జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, సీపీఓ ఎస్.ఎస్.ఆర్.కె. పట్నాయక్,ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు