కన్స్యూమర్ డే – ఎవరి కోసం?*


కన్స్యూమర్ డే – ఎవరి కోసం?*

(వినియోగదారుల సంఘాల ఆవేదన)

ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ కన్స్యూమర్ డే (డిసెంబర్ 24) నిర్వహణపై సివిల్ సప్లయస్ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం వినియోగదారుల సంఘాల నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.కన్స్యూమర్ డే కార్యక్రమం నిర్వహణ కోసం ఒక కాలేజ్/స్కూల్‌ను గుర్తించి వారి ఖాతాలోరూ.20,000లు జమ చేయడం పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి అసలు వినియోగదారుల సంఘాల నాయకులను పిలుస్తారా? లేక పూర్తిగా పక్కన పెడతారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అంతేకాకుండా, జిల్లా పౌర సరఫరాల అధికారి (DSO) పేరు ఆహ్వాన పత్రికలో ఉంటుందా? లేక వారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారా? అన్న విషయంపై కూడా అనేక జిల్లాల్లో అధికారులకే స్పష్టత లేకపోవడం గమనార్హం. ఈ అంశాలపై అధికారులు బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది.వాస్తవానికి, సివిల్ సప్లయస్ శాఖ ఆధ్వర్యంలో జరగవలసిన కన్స్యూమర్ డే కార్యక్రమాన్ని విద్యాశాఖకు అప్పగించడం ఎందుకు అన్నది వినియోగదారుల సంఘాలకు అర్థం కాని పరిస్థితిగా మారింది.
ముఖ్యంగా
జిల్లా పౌర సరఫరాల అధికారిజిల్లా వినియోగదారుల సమాచారం కేంద్రం ఇంచార్జికన్స్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్లు
వీరు లేని పరిస్థితిలో నేషనల్ కన్స్యూమర్ డేను కేవలం ‘ఫార్మాలిటీ’గా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వినియోగదారుల కోసం జరగాల్సిన రోజును, వినియోగదారులే లేకుండా కేవలం విద్యార్థులతో నిర్వహించడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం కనిపించడం లేదు.కన్స్యూమర్ డే ఉద్దేశ్యం వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడం. అలాంటి రోజున వినియోగదారుల సంఘాలను పక్కన పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
– హెచ్.ఎస్. రామకృష్ణ
ఎడిటర్, వినియోగ సమాచారం.