డ్రగ్స్ వచ్చిన కంటెయినర్ ను తాను బుక్ చేయలేదని వెల్లడి

 


సోషల్ మీడియా వేదికగా తనపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అడిషనల్ సీఈవోకు నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు. వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. విశాఖ పోర్టులో డ్రై ఈస్ట్ ముసుగులో డ్రగ్స్ దందా నడుపుతున్న వాళ్లతో తనకు ముడిపెడుతూ పోస్టింగ్ లు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆ కంటెయినర్ ను తాను బుక్ చేయలేదని... ఆ కంపెనీలో తాను షేర్ హోల్డర్ కాదని చెప్పారు. ఆ కంపెనీయే తప్పు చేసిందని సీబీఐ కూడా చెప్పలేదని అన్నారు. వారితో ఉన్న ఫొటోను తనకు జోడించి పెట్టడం సమంజసం కాదని చెప్పారు ఈ విషయంపై అడిషనల్ సీఈవోకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధింత వ్యక్తుల నుంచి వివరణ కోరుతామని అడిషనల్ సీఈవో చెప్పారని వెల్లడించారు.