నగరాభివృద్ధికి కలిసి పనిచేద్దాం

నగరాభివృద్ధికి కలిసి పనిచేద్దాం

• నగరపాలక సర్వసభ్య సమావేశంలో మేయర్ బీ.వై. రామయ్య
• పలు సమస్యలను లేవనెత్తిన పాణ్యం, కోడుమూరు నూతన శాసనసభ్యులు 
• ప్రజా సమస్యలపై వాడివేడిగా చర్చ.. పలు సమస్యలు లేవనెత్తిన కార్పొరేటర్లు
• 15 తీర్మానాలకు అమోద ముద్ర 
• సాధారణ నిధుల నుండి రూ.9.19 కోట్ల నిధుల ఖర్చుకు పచ్చ జెండా 
• నూతన ఎమ్మెల్యేలకు నగరపాలక తరపున సత్కారం  


V3 టివి న్యూస్ :
నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నూతన ప్రజాప్రతినిధులతో కలిసి పని చేద్దామని నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. సోమవారం  స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగర‌ పాలక సంస్థ కౌన్సిల్ హాలులో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నూతన ఎమ్మెల్యేలుగా తొలిసారి సమావేశానికి వచ్చిన సందర్భంగా, గౌరు చరిత రెడ్డి, బొగ్గుల దస్తగిరిలను మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు సత్కరించారు. కాగ సమావేశంలో 15 అజెండాలకు ఆమోదం తెలిపారు. నగరపాలక సాధారణ నిధుల నుండి రూ.9.19 కోట్ల అభివృద్ధి పనులను ఖర్చు చేయడానికి పాలకవర్గం పచ్చజెండా ఊపింది. 
ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ కల్లూరు వార్డులలో తాగునీటి సరఫరా సమయాన్ని పగటిపూటకు మార్చి, సరఫరా సమయాన్ని మరింతగా పెంచాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కోరారు. అలాగే అధ్వాన్నంగా మారిన రహదారులను తక్షణమే గ్రావెల్ రోడ్లు అయినా వేయాలన్నారు. కబ్జాలకు గురవుతున్న పలు పార్కు స్థలాలను కాపాడి, ప్రహారీ గోడలు నిర్మించాలని తెలిపారు. ముజఫర్ నగర్ నందు హంద్రీ నది ఒడ్డున పిచ్చి మొక్కలు తొలగించాలని కోరారు.
ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని మూడు వార్డులలో పారిశుధ్యం పనులు మరింతగా పెంచాలని, కుక్కల బెడద తగ్గించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సమావేశంలో కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలన్నింటికీ తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఏ.భార్గవ్ తేజ సమాధానమిచ్చారు. కాగ విద్యుత్ శాఖ అధికారులపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనేకసార్లు కార్పొరేటర్లు విద్యుత్ శాఖ అధికారులకు సమస్యలు చెబుతున్న తమకేం పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు.
సమావేశంలో డిప్యూటీ మేయర్లు సిద్దారెడ్డి రేణుక, అరుణ, అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, సెక్రటరీ నాగరాజు, ఎస్ఈలు శేషసాయి, షాకీర్, ఆరోగ్యధికారి విశ్వేశ్వర్ రెడ్డి,   మేనేజర్ చిన్నరాముడు, ఆర్ఓ జునైద్, సిటి ప్లానర్ సంధ్యారాణి, నగరపాలక అన్ని విభాగాల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

*పాలకవర్గం ఆమోదించిన తీర్మానాల్లో కొన్ని..*

1. 15వ ఆర్థిక సంఘం సంబంధించి పిఎఫ్‌ఎంయస్ నందు అప్లోడ్ చేయుటకు, అలాగే అదనంగా ఖర్చు అయినా రూ.4.46 కోట్లను సాధారణ నిధుల నుండి వినియోగానికి అనుమతిచ్చారు.
2. ప్రజారోగ్య విభాగంలో రెండు కేటగిరీల పారిశుద్ధ్య ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రూ.1.62 కోట్లను ఒక బిల్లు చెల్లింపునకు ఆమోదం తెలిపారు.
3. దిన్నె దేవరపాడు నందు కొత్తగా నిర్మించిన ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బిల్డింగ్‌కు, వారు జమ చేసిన రూ.20 లక్షలతో పైప్‌లైన్ వేయుటకు, రీడింగ్ ద్వారా ప్రతి నెలా వాటర్ ఛార్జీలను వసూలు చేయడానికి అనుమతిచ్చారు.
4. మునగాలపాడులోని 15 ఎంఎల్‌డి నీటి‌ శుద్ది కేంద్రం నందు బ్యాక్ వాష్, ఆలమ్ & క్లోరిన్ చేయుటకు, ముడి నీరు & క్లియర్ వాటర్ పంపింగ్ చేయుటకు రూ.97.50 లక్షలతో ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్‌లను పొరుగు సేవ పద్దతిన తీసుకొనుటకు ఆమోదించారు.
5. నగరంలో గుర్తించి ఇంకా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరగని 1,828 వీధి కుక్కలకు ఒక్కో వీధి కుక్కను పట్టి ఆపరేషన్ చేయడానికి నవోదయ వెట్ సొసైటీకి రూ.1,500/- చొప్పున మొత్తం వీధి కుక్కలకు అగు ఖర్చు రూ.27.42 లక్షలను ఖర్చు చేయడానికి ఆమోదించారు.
6. ప్రజారోగ్య విభాగంలో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్‌ పద్ధతిన చేయు టాయిలెట్ కేర్ టేకర్ల స్థానాలను అర్హులైన వారితో భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

7. ఖాళీగా ఉన్న రెవెన్యూ అధికారి పోస్టును సీనియారిటీ ప్రకారం సందే ఇజ్రాయెల్‌కి పదోన్నతి కల్పించి భర్తీ చేస్తూ తీర్మానించారు.

8. 49వ వార్డు దుర్గా ఘాట్ నుంచి దర్గా వైపుగా బండు రోడ్డు నిర్ముంచుటకు అగు రూ.49.90 లక్షలను కేటాయించారు.
9. 46వ వార్డు నరసింహ రెడ్డి నగర్ నందు అసంపూర్తిగా ఉన్న నగర పాలక సంస్థ భవనమును పూర్తి చేయడానికి రూ.49.50 లక్షలను ముంజూరు చేశారు.
10. పూడికతీత పనుల కోసం తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులను తిరిగి తీసుకుని మూడు నెలల పాటు కొనసాగించేందుకు అవసరమైన రూ.86 లక్షల మంజూరుకు ఆమోదం తెలిపారు.
11. మారుతి మెగాసిటి-2 నందు రూ.10 లక్షలతో డబ్లూబిఎం రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
12. జగన్నాథ గట్టు వద్దనున్న ఏపీ టిడ్కో నందు ఏపీ ట్రాన్స్‌కో వారు శాటిలైట్ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టుటకు నిరభ్యంతరం తెలియజేశారు.