వి3 టివి న్యూస్ కర్నూలు:
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కారించాలని సంబంధింత అధికారులను నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 11 అర్జీలు వచ్చాయి. వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధికారులకు కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా టిడ్కో ఇళ్ళకు అనర్హులు అయినందున తాము చెల్లించిన నగదు రీఫండ్ చేయాలని పలువురు కోరారు. అలాగే ఇళ్ళు అప్పగించనందున తమ బ్యాంకు ఖాతాల్లో ప్రతినెలా నగదు కట్ అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ వేణుగోపాల్, ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, డిసిసి సంధ్య, సెక్రటరీ నాగరాజు, ఆర్ఓ జునైద్, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, టిడ్కో అధికారి పెంచలయ్య, డిపిఓ ఉమోష్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చిన ఫిర్యాదులలో కొన్ని..
తమ కాలనీలో అసంపూర్తిగా ఉన్న రహదారి, మురికి కాలువల పనులు పూర్తి చేయాలని బాలాజీ నగర్‌కి సంబంధించి స్థానికులు ఏ.అబ్రహాం లింకన్, పి.సుధామణి.. అపూర్వ శిల్పారామం కాలనీకి సంబంధించి ఆర్.జయరాజు, జి.నరసన్న, ఎం.గోపాల్.. రామ్ నగర్‌కు సంబంధించి బి.శ్రీరాములు.. ఉల్చాల రోడ్డు స్కందాక్షి లోటస్ విల్లార్ వెంచర్ స్థానికులు అర్జీలను అందించారు.
చెక్‌పోస్ట్ సమీపంలో జోహరపురం రహదారిన పార్కు స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూడాలని బిజెపి నాయకులు యం.రాంమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
రేణుకా నగర్, రాధా నగర్‌లలో సరైన సదుపాయాలు లేవని అలాగే కొందరు పార్కు స్థలాన్ని కబ్జా చేశారని, వాటిని స్వాధీనం చేసుకుని పార్కు ఏర్పాటు చేయాలని స్థానికులు ఎల్.రత్నారెడ్డి, సి.శ్రీరాములు, గోపాల్ సింగ్ కోరారు.
చెక్‌పోస్ట్ సమీపంలో ధనలక్ష్మి నగర్ నందు రోడ్డు మరమ్మతులు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, నీటి సరఫరా సమయం పెంచుట వంటి సమస్యలపై ధనలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
పెద్దపాడు రహదారిన బృందావనం కాలనీ నందు వీధి దీపాలు లేవని స్థానికులు కె.శ్రీనివాస మూర్తి ఫిర్యాదు చేశారు.