విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాల్సిన గురువులే గాడి తప్పితే ఎలా? దామోదర్....
****************************
మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అని మన పెద్దలు చెప్పారు. అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుది. విద్యార్థులకు విద్యతో పాటుగా నైతిక విలువలను బోదించాల్సిన ఉపాద్యాయులే ఆ నైతిక విలువలను పాటించక పాఠాలు చెప్పాల్సిన విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడం క్షమించరాని నేరం అని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని ఓ గ్రామంలో ఉన్నత పాఠశాలలోని ఓ ఉపాధ్యాయ పుంగవుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు విన్నవించగా విచారణ అనంతరం తప్పు చేసిన ఆ ఉపాధ్యాయుడిని విధుల నుండి తప్పించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఇదేనా? మనం ఒక సారి ఆలోచించాలి. ప్రస్తుత కాలంలో ఆడ పిల్లలకు రక్షణ కరవు అయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, మానభంగాలు, ఇలా అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు చాలా ఉన్నాయి. బయటకి వచ్చేవి కొన్ని అయితే రానివి ఎన్ని ఉన్నాయో? కొంతమంది ఉపాధ్యాయులు అసలు తాము చేస్తున్న వృత్తికి తాము చేస్తున్న పనులకు అసలు సంబంధం ఉండడం లేదు అయినా అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి. కొంత మంది ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థలు పెట్టుకుని బడిలో పాఠాలు చెప్ప వలసిన సమయంలో కూడా బయట వారి స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలాగే వారు చేస్తున్న కార్యక్రమాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కూడా పాల్గొనేటట్టు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? అడిగేవారు లేరా? మరి కొంత మంది ఉపాధ్యాయులు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో అసభ్యకరమైన పాటలకు అశ్లీల నృత్యాలు, వెకిలి చేష్టలు చేయిస్తున్నారు. దానికి వారు పెట్టిన పేరు కళాపోషణ. అసలు మనం మన పిల్లలను ఎక్కడికి తీసుకుపోతున్నాం? పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ప్రవర్తించే తీరు ఇదేనా? ఇలాంటి కొంత మంది ఉపాధ్యాయుల వలన బాగా పాఠాలు చెప్పేవారు కూడా వారికి తగినంత ప్రోత్సాహం, ప్రచారం లేక వారు కూడా పిల్లలకు పాఠాలు చెప్పడం మానేస్తున్నారు. ఇలా స్వచ్ఛంద సంస్థలు పెట్టుకుని ప్రచారం కోసం పాకులాడే వారు తమ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసేసి ఆ స్వచ్ఛంద సంస్థలు నడుపుకుంటే కనీసం నిరుద్యోగులైన కొంత మంది యువతకు అయినా ఉపాధి దొరుకుతుంది కదా. ఎందుకు ఇలా రెండు పడవలపైన కాలు వేసి విద్యార్థులను, ప్రభుత్వాన్ని మోసం చెయ్యడం. విద్యాశాఖ అధికారులు ఇలాంటి వారపై దృష్టి పెట్టాలి. అలాగే ప్రభుత్వ పాఠశాల లపై పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణమే.
నాకు తెలిసి ప్రతీ ప్రభుత్వ పాఠశాలలలో కూడా తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలి. వీటి వలన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలో ఏమి చేస్తూన్నారో తెలూస్తుంది. ఉపాధ్యాయులు గాని విద్యార్థులు గాని ఎవరూ కూడా తరగతి గదులలో సెల్ ఫోన్ వాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అలా వాడే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు నిరంతరం పర్యవేక్షణ చెయ్యాలి. ఏ ఉపాధ్యాయుడు అయినా సక్రమంగా విధులు నిర్వహించకున్నా విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించినా వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చెయ్య వచ్చు. ఇది మన అందరి బాధ్యత. దయచేసి విజ్ఞతతో ఆలోచించండి.