కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంపై అవగాహన ర్యాలీ

కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంపై అవగాహన ర్యాలీ 

జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మద్దికేర వైద్యాధికారులు డాక్టర్ శ్రీ లక్ష్మీ, డాక్టర్ రాగిణి ల ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంపై ఆశా కార్యకర్తలకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు మండల లెప్రసీ నోడల్ ఆఫీసర్ కృష్ణమ్మ , లెప్రసీ కార్యక్రమం పై శిక్షణ శిబిరము మరియు అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మాట్లాడుతూ కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం ఈనెల 18వ తేదీ నుండి ఆగస్టు రెండో తేదీ వరకు జరుగుతుందని ,ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు టీంలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో ఇంటింటికి సందర్శించి కుష్టు వ్యాధి, వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగిస్తారని అనుమానాస్పద కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పూర్తిస్థాయిలో చికిత్స అందజేయడంలో సహకరిస్తారని తెలిపారు .చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు మరియు చర్మం పొడిగా ఉండడం, కను బొమ్మలు మరియు కనురెప్పలు వెంట్రుకలు రాలిపోవడం, మందమైన మెరిసే జిడ్డు గల చర్మం, చేతుల నుండి వస్తువులు జారిపోవడం, అరచేతులు అరికాళ్ల లో స్పర్శ కోల్పోవడం ,తెలియకుండానే చేతులు కాళ్లలో బొబ్బలు రావడం, చేతి వేళ్ళు కాలివేళ్ళు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం, చల్లని లేదా వేడి వస్తువులు స్పర్శ తెలియకపోవడం, పాదాల పైన వాపు ఉండడం పై అనుమానాస్పద లక్షణాలు ఉన్నయెడల ఇంటి వద్దకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు సర్వే చేయడానికి వచ్చినప్పుడు చూపించుకోవాలని మరియు దీనికి సంబంధించిన చికిత్సలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభిస్తాయని తెలిపారు. అనంతరం కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు, లెప్రసీ నోడల్ ఆఫీసర్ కృష్ణమ్మ ,హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా, ఆరోగ్య పర్యవేక్షకులు సూర్యనారాయణ, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.